Bible Versions
Bible Books

1 Kings 4 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు.
2 తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి: సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు.
3 షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు.
4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు. సాదోకు, అబ్యాతారు యాజకులు.
5 నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి. నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు.
6 అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు. అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి.
7 ఇశ్రాయేలును పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు.
8 పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: బెన్‌-హూరు కొండల ప్రాంతమైన ఎఫ్రాయిమునందు పాలకుడు;
9 బెన్‌-దెకెరు అనునతను మాకస్సు, షయల్బీము, బేత్షెమెషులోను మరియు ఏలోన్భెధానానులోను;
10 బెన్‌-హెసెదు అనువాడు అరుబ్భోతు, శోకో మరియు హెపెరులోను;
11 బెన్‌-అబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు సొలొమోను కుమారైయగు టాపాతును వివాహ మాడాడు);
12 అహీలూదు కుమారుడైన బయనా అనువాడు తానాకు, మెగిద్దో మరియు సారెతాను పక్కనున్న బేత్షెయాను ప్రాంతమంతటికీ; (ఈ ప్రాంతం యెజ్రెయేలు దిగువ బేత్షెయాను మొదలుకొని ఆబేల్మే హోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి ఉన్నది)
13 బెన్‌-గెబెరు అనునతను రామోత్గిలాదులోను; (ఇతడు గిలాదులోని మనష్షే కుమారుడైన యాయీరు పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషానులో ఉన్న అర్గోబు మండల ప్రాంత మునకు కూడా పాలకుడుగా నియమింపబడ్డాడు. ప్రాంతంలో చుట్టూ ప్రాకారాలున్న అరువది నగరాలున్నాయి. నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు చేయబడ్డాయి).
14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోను;
15 అహీమయస్సు అనునతడు నఫ్తాలీములోను, ఇతడు సొలొమోను కుమార్తెయగు బాశెమతును వివాహమాడాడు;
16 హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
17 పరూయహు కుమారుడగు యెహోషాపాతు ఇశ్శాఖారు ప్రాంతంలోను;
18 ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను; సొలొమోను కింది అధికారులు, పాలకులు
19 ఊరి కుమారుడైన గెబెరు అనునతడు గిలాదులోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు ప్రాంతంలో అమోరీయులకు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు నివసించేవారు). కాని ప్రాంత మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా నియమితుడయ్యాడు.
20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. సామ్రాజ్యాధి పతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు .
22 This verse may not be a part of this translation
23 This verse may not be a part of this translation
24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది.
25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల కింద, ద్రాక్షాలతల కిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
26 సొలొమోను తన రథాలనులాగే నాలుగు వేలగుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. ఆయనకు పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది.
27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి.
28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహ కందనిది .
30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి.
31 భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది.
32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు . అతనింకా వెయ్యిన్ని ఐదు కీర్తనలు కూడా రచించాడు.
33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు.
34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×