Bible Versions
Bible Books

Hosea 13 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు.
2 ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తామ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు.
3 అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. పొగ మంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యపు పోత పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.
4 “మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మీరు మరో దేవుడెవరినీ ఎరుగరు. మిమ్మల్ని రక్షించినది నేనే.
5 మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు.
6 ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!
7 “అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుత పులిలాగా ఉంటాను.
8 తన కూనల్ని కోల్పోయిన ఎలుగు బంటి లాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక కృర మృగంలాగ ఉంటాను”
9 “ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తాను.
10 నీ రాజు ఎక్కడున్నాడు? నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! నీ న్యాయాధిపతులు ఎక్కడ? నీవొకప్పుడు ‘నాకొక రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి’ అని అడిగావు.
11 నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి తీసేసుకున్నాను.
12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు. తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు. (కాని, అతను శిక్షంపబడతాడు.)
13 అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది. అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు. అతని పుట్టుకకి సమయం ఆసన్నమవుతుంది, కాని అతను బతికి బయటపడడు.
14 “నేను వాళ్లనా సమాధినుంచి కాపాడుతాను! నేను వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను! మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి? సమాధీ నీ శక్తి ఎక్కడ? నేను పగ సాధించాలని చూడటం లేదు!
15 ఇశ్రాయేలు తన సోదరుల మద్య పెరుగుతాడు. కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది. అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరే సుకుపోతుంది.
16 షోమ్రోను శిక్షింపబడాలి. ఎందుకంటే, అది తన దేవునికి వ్యతిరేకమైంది. ఇశ్రాయేలీయులు కత్తులతో చంపబడతారు. వాళ్ల పిల్లలు తునాతునకలు చేయబడతారు. వాళ్ల గర్భిణీస్త్రీల కడుపులు చీల్చబడతాయి.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×