Bible Versions
Bible Books

Isaiah 60 (IRVTE) Indian Revised Version - Telugu

1 {సీయోను పై ఉదయించిన మహిమ} PS లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
2 భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
3 రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.
4 తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు.
5 నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది.
6 ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.
7 నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను.
8 మబ్బులాగా గువ్వలలాగా తమ గూటికి ఎగిరి వచ్చే వీళ్ళెవరు?
9 నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు,
కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి,
ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి.
10 విదేశీయులు నీ గోడలు కడతారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు.
ఎందుకంటే నేను ఆగ్రహంతో నిన్ను కొట్టినా అనుగ్రహంతో నీ మీద జాలిపడతాను.
11 రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు.
ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు.
12 నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి.
13 నా పరిశుద్ధాలయపు అలంకారం కోసం లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షాలూ సరళవృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు.
నేను నా పాదాలు పెట్టుకునే స్థలాన్ని ఘనంగా చేస్తాను.
14 నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు.
యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు.
15 నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు
నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.
16 రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు.
యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు.
17 నేను కంచుకు బదులు బంగారాన్నీ ఇనుముకు బదులు వెండినీ
చెక్కకు బదులు ఇత్తడినీ రాళ్ళకు బదులు ఇనుమునూ తెస్తాను. శాంతిని నీకు అధికారులుగా న్యాయాన్ని నీకు పరిపాలకులుగా నియమిస్తాను.
18 ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు.
నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు.
19 ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు.
వెన్నెల నీ మీద ప్రకాశింపదు.
యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.
20 నీ సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ వెన్నెల తగ్గదు.
యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దుఃఖదినాలు అంతం అవుతాయి.
21 నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది.
వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని.
22 అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు.
నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×