Bible Versions
Bible Books

Isaiah 61 (IRVTE) Indian Revised Version - Telugu

1 {రక్షణ శుభవార్త} PS ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.
అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.
గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,
2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.
3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.
నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.
4 పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు.
తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు.
5 విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు.
6 మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు.
రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు.
7 మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు దీవెనలు వస్తాయి. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు.
తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. నిత్యానందం వారిది అవుతుంది.
8 ఎందుకంటే న్యాయం చేయడం యెహోవా అనే నాకు ఇష్టం. దోచుకోవడం, అన్యాయంగా ఒకడి సొత్తు తీసుకోవడం అంటే నాకు అసహ్యం.
నమ్మకంగా నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను. వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
9 రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు.
వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.
10 పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు
ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు.
యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
11 భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా
రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×