Bible Versions
Bible Books

Job 6 (IRVTE) Indian Revised Version - Telugu

1 {యోబు జవాబు} PS అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
2 ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక.
3 అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్ధమైన మాటలు పలికాను.
4 సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి.
5 అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా?
6 ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా?
7 అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది.
8 నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది!
9 దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక. తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక.
10 ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది.
11 నాకున్న బలం ఎంత? నేను దేని కోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి?
12 నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా?
13 నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా.
14 కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు.
15 నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు.
16 అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి.
17 వేసవికాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్నచోట్ల నుండి ఆవిరైపోతాయి.
18 వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి.
19 తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు.
20 వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురౌతారు.
21 మీరు ప్రవాహం వలే ఉండీ లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు.
22 నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా?
23 శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా?
24 నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి.
25 యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి?
26 నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా.
27 మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది.
28 దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా?
29 ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, విషయాల్లో నేను నిర్దోషిని.
30 నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా? PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×