Bible Versions
Bible Books

Job 36 (IRVTE) Indian Revised Version - Telugu

1 ఎలీహు ఇంకా ఇలా అన్నాడు.
2 కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది.
3 దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను.
4 నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు.
5 దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది.
6 భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు.
7 నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు.
8 వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే,
9 అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు.
10 ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు.
11 వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.
12 వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు.
13 అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు.
14 కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది.
15 బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు.
16 అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు.
17 దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి.
18 కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు.
19 నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా?
20 ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు.
21 పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి.
22 ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు?
23 ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? “నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు” అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు?
24 ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు.
25 మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి కార్యాలను చూశారు.
26 ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు.
27 ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.
28 మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి.
29 నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?
30 చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు.
31 విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు.
32 తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు.
33 వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×