Bible Books

:
-

1. {గొప్ప ఆహ్వానం} PS “దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి.
రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి.
2. తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు?
నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి.
3. శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు.
నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.
4. ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.”
5. నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది.
ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు.
6. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.
7. భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.
వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.
8. “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.
9. “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.
10. వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.
దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.
అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.
11. ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.
అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
12. మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు.
మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.
13. ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి.
విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.” PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×